Parcel Scams: ఒక్క SMS తో సర్వం పోగొట్టుకోవద్దు! ఈ రోజుల్లో సైబర్ మోసాలు (Cyber Frauds) పెరిగిపోతున్నాయి. కొరియర్ కంపెనీలు లేదా పోస్టల్ డిపార్ట్మెంట్ పేరుతో జరుగుతున్న పార్శిల్ స్కామ్‌ల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మోసం ఎలా జరుగుతుందో, దాని నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
పార్శిల్ స్కామ్ ఎలా జరుగుతుంది? (Parcel Scams)
- మీ ఫోన్‌కి ఒక SMS వస్తుంది. అది కొరియర్ కంపెనీ లేదా పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి వచ్చినట్లుగా ఉంటుంది.
- ఆ SMSలో మీకు ఒక పార్శిల్ ఉందని, కానీ అడ్రస్ సరిగా లేకపోవడం వల్ల దాన్ని డెలివరీ చేయలేకపోతున్నామని ఉంటుంది.
- మీ అడ్రస్ని అప్డేట్ చేయమని, ఆ SMSలో ఒక నకిలీ లింక్ (Phishing Link) ఉంటుంది.
- మోసగాళ్లు మీకు ఫోన్ చేసి, వెంటనే అడ్రస్ అప్డేట్ చేయకపోతే పార్శిల్ డెలివరీ క్యాన్సిల్ అవుతుందని కంగారు పెడతారు.
- మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి అడ్రస్ అప్డేట్ చేస్తే, తర్వాత ₹25 లేదా ₹50 వంటి తక్కువ మొత్తంలో టోకెన్ పేమెంట్ చేయమని అడుగుతారు. ఈ పేమెంట్ కేవలం క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే చేయమని చెప్తారు.
- మీరు మీ కార్డ్ వివరాలు (కార్డ్ నంబర్, ఎక్స్పైరీ డేట్, CVV) ఎంటర్ చేస్తే, ఆ వివరాలు మోసగాళ్లకు చేరిపోతాయి. దానితో వారు మీ అకౌంట్ నుండి డబ్బులు కొట్టేస్తారు.
ఇలాంటి మోసాల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? (Parcel Scams)
- ప్రశాంతంగా ఉండండి: మోసగాళ్లు ఎప్పుడూ కంగారు పెట్టేలా మాట్లాడతారు. వెంటనే నిర్ణయం తీసుకునేలా చేస్తారు. అలాంటి వాళ్ల మాటలు నమ్మకండి.
- సందేహాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దు: మీకు వచ్చిన SMS ఎక్కడి నుండి వచ్చిందో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. ఏ కొరియర్ కంపెనీ కూడా అడ్రస్ అప్డేట్ చేయమని లింక్‌లు పంపించదు. అలాంటి లింక్‌లను అస్సలు క్లిక్ చేయవద్దు.
- నిజ నిర్ధారణ చేసుకోండి: మీకు ఏదైనా కంపెనీ నుండి SMS వస్తే, అది నిజమో కాదో తెలుసుకోవడానికి ఆ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి లేదా కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి అడగండి.
ఒకవేళ మోసపోతే వెంటనే ఏం చేయాలి? (Parcel Scams)
- మీరు ఒకవేళ సైబర్ మోసానికి గురైతే, National Cyber Crime పోర్టల్ అయిన cybercrime.gov.in వెబ్సైట్లో, ఫ్రాడ్ జరిగిన వెంటనే ఫిర్యాదు చెయ్యాలి. గుర్తుంచుకోండి….
- లేదంటే మోసపోయిన వెంటనే, క్షణం ఆలస్యం చెయ్యకుండా 1930 అనే హెల్ప్‌లైన్ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చెయ్యాలి (Cybercrime Complaint).
- మీ బ్యాంక్ హెల్ప్‌లైన్ నంబర్‌కి కూడా ఖచ్చితంగా ఫోన్ చేసి విషయం చెప్పి ఫిర్యాదు చెయ్యాలి.
- మళ్ళీ చెబుతున్నా సైబర్ ఫ్రాడ్ జరిగిన వెంటనే, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ (1930)కి మరియు బ్యాంకు కి క్షణం ఆలస్యం చెయ్యకుండా ఫిర్యాదు చెయ్యాలి. సైబర్ క్రైమ్ కి (1930) కాల్ చేసే ముందే, కాల్ రికార్డింగ్స్, స్క్రీన్ షాట్స్, మోసపోయిన డబ్బు తాలూకా ఎస్.ఎం.ఎస్. వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే, వారు మిమ్మల్ని కాల్ లోనే ఉంచి, ఎలా మోసపోయారో వివరాలు అడుగుతారు. అవన్నీ స్పష్టంగా, కంగారుపడకుండా వివరించాలి. ఈ ప్రక్రియ అంతా, ఫ్రాడ్ జరిగిన 3 గంటలలోపే జరగాలి. అప్పుడే మీరు మోసపోయిన డబ్బులు తిరిగిపొందే అవకాశం 90% ఉంటుంది.
గుర్తుంచుకోండి:
- తెలియని వ్యక్తుల నుండి వచ్చిన ఏ లింక్‌ని కూడా క్లిక్ చేయవద్దు.
- మీ వ్యక్తిగత వివరాలను, బ్యాంక్ వివరాలను ఎవరితోనూ షేర్ చేయవద్దు.
- ముఖ్యంగా, కంగారులో మీ మొబైల్ స్క్రీన్ షేర్ చెయ్యకండి.
మీకు ఏదైనా అనుమానాస్పద SMS, ఈమెయిల్ లేదా కాల్ వస్తే, వెంటనే sancharsaathi.gov.in లోని Sanchar Saathiకి మరియు మీ బ్యాంక్ యాంటీ-ఫిషింగ్ విభాగానికి ([email protected]) ఫిర్యాదు చేయండి.
అప్రమత్తంగా ఉండండి, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఇలాంటి మోసాల నుండి కాపాడుకోండి. సురక్షితంగా ఉండండి.
ఎంతో కష్టపడితే కానీ ఒక రూపాయి సంపాదించలేకపోతున్నాము.
డబ్బులెవరికి ఊరికే రావు. సైబర్ నేరగాళ్లు మాత్రం ఉత్తపుణ్యానికి కొట్టేస్తున్నారు. జాగ్రత్త.
ఈ విషయాన్నీ అందరికి షేర్ చెయ్యండి. ఇంకొకరు మోసపోకుండా జాగ్రత్త చేసినవాళ్ళం అవుతాం.
- “తెలుగు వార్తలు, సినిమా అప్డేట్స్, ఆరోగ్యం మరియు ఆయుర్వేదం, కవరేజ్ కోసం naatvtelugu.comని సందర్శించండి. తాజా, కచ్చితమైన సమాచారం మీ అరచేతిలో!”
- నాటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేయండి.


