HomeCinemaLenin Movie Review: అఖిల్ అక్కినేని 'లెనిన్' మూవీ రివ్యూ.. మాస్ యాక్షన్ కురుక్షేత్రం మెప్పించిందా?

Lenin Movie Review: అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మూవీ రివ్యూ.. మాస్ యాక్షన్ కురుక్షేత్రం మెప్పించిందా?

Lenin Movie Review: అఖిల్ అక్కినేని కెరీర్‌లో ఈ సినిమా ఎంతో కీలకమైనది. ‘ఏజెంట్’ తర్వాత కొంత విరామం తీసుకున్న ఆయన, పూర్తిగా కొత్త తరహా మాస్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించిన ‘లెనిన్’ (Lenin) విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ Lenin Movie Review లో ఎంతవరకు అందుకుందో చూద్దాం.

శ్రీరామపురం కథా నేపథ్యం

చిత్తూరు జిల్లా సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గం శ్రీరామపురం గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. దాదాపు పాతికేళ్ళ క్రితం జరిగిన కథగా దీనిని చూపించారు.

ప్రతి ఏడాది అక్కడ ‘భారతం మెట్ట’ పేరుతో ద్రౌపది ఉత్సవాలు 18 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఆ ఉత్సవాల సమయంలో గ్రామంలో రక్తపు చుక్క కూడా నేలపై పడకూడదనేది ముఖ్యాచారంగా ఉంటుంది.

అలాంటి గ్రామానికి అనాథగా, ఆకలితో వచ్చిన లెనిన్‌ను జయంతి అనే పెద్దింటి మహిళ (ఈశ్వరీరావు) చేరదీస్తుంది. తన కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు)తో సమానంగా పెంచి పెద్ద చేస్తుంది.

ఊరి ఉత్సవాలు – జైలు జీవితం

కాలక్రమంలో లెనిన్ గ్రామ ప్రజలకు ఆప్తుడిగా మారి, భారతం మెట్ట ఉత్సవాల నిర్వహణ బాధ్యతను తన భుజాలపై వేసుకుని నడిపిస్తుంటాడు. వసంత్ వైద్యం చదువుకుని ఊరికొస్తాడు.

ఇక మావ వరస అయ్యే నీలకంఠం (రాంకీ) రెండో కూతురు భారతి (భాగ్యశ్రీ బోర్సే)తో లెనిన్ ప్రేమలో పడతాడు. తనకు భారతి అంటే ప్రాణం. పెద్దల అంగీకారంతో వసంత్ వీరిద్దరి పెళ్లి జరిపిస్తాడు.

అయితే ఊహించని పరిణామాలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఉత్సవాల చివరి రోజు జరిగిన ఒక సంఘటనతో భారతం మెట్ట అగ్నిగుండంలా రగులుతుంది. పరాయి వాళ్ల నుంచే కాదు, అయిన వాళ్ల నుంచి కూడా అవాంతరాలు ఎదురై లెనిన్ కడప సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది.

కొన్నాళ్లు జైలు జీవితం గడిపి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అసలు జైలుకు వెళ్లడానికి కారణమేంటి? తనకు అత్యంత సన్నిహితులైన వారే ఎలా ప్రత్యర్థులయ్యారు? తన పగ, ప్రతీకారాలను ఎలా తీర్చుకున్నాడు? అనేదే మిగిలిన సినిమా కథ.

లెనిన్ మూవీ విశ్లేషణ (Lenin Movie Review)

‘లెనిన్’ను సాధారణ గ్రామీణ యాక్షన్ డ్రామాగా కాకుండా, మహాభారతాన్ని ప్రతీకగా ఉపయోగించి రూపొందించిన ప్రయత్నం కనిపిస్తుంది. అధికారం, గౌరవం, ప్రేమ, ప్రతీకారం, స్వార్థం చుట్టూ తిరిగే పాత్రల మధ్య సంఘర్షణే కథకు ప్రధాన బలం.

చిత్తూరు జిల్లాలో నిజంగానే జరిగే ‘భారతం మెట్ట’ ఉత్సవాల నేపథ్యాన్ని కథతో మేళవించడమే ‘లెనిన్’ సినిమా ప్రత్యేకత. అఖిల్ అక్కినేని పక్కా పల్లెటూరి మాస్ యువకుడిగా రాయలసీమ యాసతో నటించిన ఈ చిత్రం రూరల్ యాక్షన్ డ్రామాగా సాగుతుంది.

సినిమా ప్రారంభంలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో భారతం మిట్ట ఉత్సవాల నేపథ్యాన్ని పరిచయం చేయడం, జైలు నుంచి హీరో బయటకు వచ్చే సన్నివేశాలతో ఆడియెన్స్ లో ఉత్సుకత పెరుగుతుంది. మొదటి భాగంలో దర్శకుడు కథకు అవసరమైన పాత్రలను పరిచయం చేయడంలో ఎక్కువ సమయం తీసుకున్నాడు.

అయితే ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసినట్లే అనిపిస్తాయి. ముఖ్యంగా హీరో-హీరోయిన్ల ప్రేమకథ, గ్రామంలో జరిగే కొన్ని ఎపిసోడ్లు పెద్దగా కొత్త అనుభూతిని ఇవ్వవు. కథ ముందుకు సాగేకొద్దీ పక్కా కమర్షియల్ ఫార్మాట్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

గ్రే షేడ్స్ – ఆకట్టుకునే ద్వితీయార్ధం

ఇంటర్వెల్‌కు చేరుకునే సమయానికి కథ అసలు దారిలోకి వస్తుంది. అప్పటి వరకు సాధారణంగా కనిపించిన పాత్రలు ఒక్కో మలుపులో తమ అసలు స్వరూపాన్ని బయటపెడుతుండటంతో ద్వితీయార్ధంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది.

అదే ఊపులోనే ద్వితీయార్ధం మొదలవుతుంది. అప్పటి వరకు సానుకూలంగా కనిపించిన కొన్ని పాత్రల్లోని గ్రే షేడ్స్ ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. వాటిని జీర్ణించుకోవడానికి ప్రేక్షకులకు కాస్తంత టైమ్ పడుతుంది.

అదే సమయంలో వసంత్ ప్రేమకథ, యతిరాజులు పాత్ర చుట్టూ సాగే పరిణామాలు, గాంధారిని తలపించేలా పెద్దమ్మ (జయంతి) తీసుకునే కీలక నిర్ణయం కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. హీరో శత్రువులంతా ఒకచోటకు చేరిన తర్వాత కథ ఊహించని మలుపులు తిరుగుతుంది.

చివర్లో హీరో జీవితానికి సంబంధించిన ఒక బలహీనతను, కీలక విషయాన్ని వెల్లడించే విధానం ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తుంది. సాంప్రదాయ తెలుగు సినిమాల్లో కనిపించే పూర్తి స్థాయి హ్యాపీ ఎండింగ్‌కు భిన్నంగా ఈ సినిమా ముగుస్తుంది. ఈ విషాదాంతం (ట్రాజిక్ ఎండింగ్) ప్రేక్షకులను భారంగానే థియేటర్ నుంచి బయటకు పంపుతుంది.

‘లెనిన్’ మూవీ నటీనటుల నటన తీరు

అఖిల్ అక్కినేని ఈ సినిమాలో తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని పల్లెటూరి మాస్ పాత్రలో కనిపించారు. ఆయన బాడీ లాంగ్వేజ్, రాయలసీమ యాస, యాక్షన్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాల్లోనూ చూపించిన నటన ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ప్రధాన హైలైట్ అఖిల్ అక్కినేని నటనే అని చెప్పాలి.

భాగ్యశ్రీ బోర్సేకు కేవలం గ్లామర్‌కే పరిమితమైన పాత్ర కాకుండా కథలో ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించింది. తన అందచందాలతో మెస్మరైజ్ చేస్తూనే మంచి నటన కనబరిచింది.

వసంత్ పాత్రలో ప్రమోద్ పంజు తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే పాపులర్ తెలుగు ఆర్టిస్టులను ఈ పాత్రకు తీసుకుని ఉంటే బాగుండేది. ఈశ్వరీరావు, శివాజీ, బ్రహ్మాజీ, సునీల్, శత్రు, రాంకీ, వడ్లమాని సాయి శ్రీనివాస్‌, గెటప్ శ్రీను, ప్రవీణ్ తదితరులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.

‘లెనిన్’ మూవీ సాంకేతిక విభాగం పనితీరు

గ్రామీణ నేపథ్యంలో మహాభారత ప్రతీకలను కథతో మేళవించడంలో దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు తన ప్రత్యేక దృష్టిని చూపించారు. ప్రధాన పాత్రలకు బలమైన నేపథ్యాన్ని రూపొందించడంలో దర్శకుడి ప్రయత్నం కనిపిస్తుంది.

తమన్ అందించిన పాటలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయాయి. అయితే నేపథ్య సంగీతం కీలక సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఎక్కడా రాజీ పడలేదనే విషయం నిర్మాణ విలువల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకు ‘లెనిన్’ అనే పేరు ఎందుకు పెట్టారో అర్థం కాదు.

Lenin Movie Review – ప్లస్ పాయింట్స్

  • అఖిల్ అక్కినేని మాస్ నటన, రాయలసీమ యాస

  • ద్వితీయార్ధంలోని ఊహించని ట్విస్టులు, గ్రే షేడ్స్

  • మహాభారత ప్రతీకలతో సాగే కథనం

  • గ్రామీణ నేపథ్యం, నిర్మాణ విలువలు

  • క్లైమాక్స్ వరకు కొనసాగిన ఉత్సుకత

Lenin Movie Review – మైనస్ పాయింట్స్

  • ఫస్ట్ హాఫ్‌లో రొటీన్, కమర్షియల్ సన్నివేశాలు

  • ప్రేమకథలో కొత్తదనం లేకపోవడం

  • పాటలు ఆశించిన స్థాయిలో లేకపోవడం

  • క్లైమాక్స్ లోని విషాదాంతం (ట్రాజిక్ ఎండింగ్) అందరికీ నచ్చకపోవచ్చు

Lenin Movie Review – ఫైనల్ వెర్డిక్ట్

‘లెనిన్’ (Lenin) పూర్తిగా కమర్షియల్ ఫార్మాట్‌లో సాగే యాక్షన్ డ్రామానే అయినప్పటికీ, మహాభారతాన్ని ప్రతీకగా ఉపయోగించిన కథనం, ద్వితీయార్ధంలో వచ్చే మలుపులు, అఖిల్ అక్కినేని నటన సినిమాకు ప్రధాన బలాలుగా నిలుస్తాయి.

మొత్తంగా చూస్తే, ‘లెనిన్’ పూర్తిగా కొత్త కథ చెప్పకపోయినా, మహాభారత ప్రతీకలు, ద్వితీయార్ధంలోని ట్విస్టులు, అఖిల్ అక్కినేని నటన సినిమాను ఆసక్తికరంగా నిలబెడతాయి. ఫస్ట్ హాఫ్‌లోని రొటీన్ ట్రీట్‌మెంట్‌ను పక్కన పెడితే, రూరల్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది ఒకసారి చూడదగ్గ చిత్రం.

Also Read: Lenin First Review: మైండ్ బ్లాక్ చేసే క్లైమాక్స్ ట్విస్ట్.. అఖిల్‌కు ఈ సారైనా సాలిడ్ హిట్ పక్కానా?

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments