Sing Geetham OTT: థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న వైవిధ్యభరితమైన మ్యూజికల్ ఫాంటసీ డ్రామా ‘సింగ్ గీతం’ (Sing Geetham) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 8 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్లో (Netflix) తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
‘సింగ్ గీతం’ ప్రత్యేకత ఏంటి?
94 ఏళ్ల వయసులోనూ ఎంతో ఎనర్జీతో వైవిధ్యమైన కథలను తెరకెక్కించే లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో మొదటి నుంచీ దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ‘మహానటి’, ‘కల్కి 2898 AD’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థలు వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై చలసాని అశ్విని దత్ సమర్పణలో ఈ సినిమా రూపొందింది.
అహల్య బంరూ, అయాన్, షాలిని కొండేపూడి, శివ నారాయణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ Sing Geetham Movie జూన్ 12న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఎంతోమంది సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాను వీక్షించి, చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
అసలు ‘సింగ్ గీతం’ కథేంటి?
ఇదొక వినూత్నమైన మ్యూజికల్ ఫాంటసీ డ్రామా. ప్రకృతిని పూర్తిగా నాశనం చేసి, బంగారు గనుల మైనింగ్‌గా మారిన ఒక గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఆ ఊరిలో మిగిలి ఉన్న చిట్టచివరి పవిత్రమైన చెట్టును కొందరు స్వార్థపరులు నరికేస్తారు. దాంతో ఆ గ్రామానికి ఒక వింతైన శాపం చుట్టుముడుతుంది.
ఆ మరుసటి రోజు నుంచి ఊరి ప్రజలందరూ సాధారణంగా మాట్లాడే శక్తిని కోల్పోతారు. తమ మనసులోని కోపం, ప్రేమ, బాధ వంటి ఏ భావాన్నైనా కేవలం పాట రూపంలో మాత్రమే వ్యక్తపరచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
-
ఈ వింత శాపం వల్ల ఆ ఊరిలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి?
-
మాటలు లేకుండా కేవలం సంగీతంతోనే మనుషులు ఎలా కమ్యూనికేట్ చేసుకోగలిగారు?
-
చివరికి గ్రామస్థులు తమ తప్పును తెలుసుకుని ప్రకృతిని కాపాడుకుంటూ ఆ శాపం నుండి ఎలా విముక్తి పొందారు?
అనే ఆసక్తికరమైన అంశాలను ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా చూపించారు. థియేటర్లలో సక్సెస్ సాధించిన ఈ విలక్షణమైన చిత్రం, థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు Sing Geetham OTT ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. వినూత్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమాను ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి, కాదు చూడాల్సిందే…
ఎందుకంటే…
మనిషికి అత్యాశ ఎక్కువ అయిపోతోంది. ఇంకా చెప్పాలంటే మితిమీరిన అత్యాశ అని చెప్పక తప్పదు. తన మనుగడకోసం పర్యావరణాన్ని పాడుచేస్తున్నాడు. ప్రకృతి అంటే మనం, మనం అంటే ప్రకృతి అని విషయం పూర్తిగా మర్చిపోయాడు. పర్యావరణాన్ని నాశనం చేస్తూ, అభివృద్ధి అనే పేరుపెట్టి సమర్ధించుకుంటున్నాడు.
మీరు మీ పిల్లలకి కోట్లు సంపాదించి ఇచ్చినా, వాళ్ళు పీల్చడానికి ఆక్సిజన్ సిలిండర్లు కొనడానికే ఆ డబ్బు సరిపోవు.
ఇంటి నిండా ఏసీలు పెడితే ఇల్లు చల్లబడుతుంది, కానీ ఊపిరితిత్తులు పాడవుతాయి. అదే ఒక చెట్టు ఉంటే ఇల్లూ చల్లబడుతుంది, ఆయుష్షూ పెరుగుతుంది.
మీరు కార్లు, బైకులు కొనేటప్పుడు వచ్చే గర్వంలో 10%… మీరు నాటిన చెట్టు మహావృక్షం అయినప్పుడు కలగాలి.
“మీ పిల్లల పుట్టినరోజున కేక్ కట్ చేయడం ఎంత ముఖ్యమో, వాళ్ళ పేరు మీద ఒక మొక్క నాటి, దాన్ని పెంచడం అంతే ముఖ్యం” అని ప్రతి ఇంటా ఒక సెంటిమెంట్‌గా మార్చాలి, అని “చెట్లు నరకద్దు” అని సినిమా తో సింగీతం శ్రీనివాస రావు గారు చెప్పే ప్రయత్నం చేసారు.
సింగ్ గీతం సినిమాలో గ్రాఫిక్స్ ఉన్నాయ్, మాటల్ని పాటలు చేసిన ప్రయత్నం బాగానే ఉంది, 2 గంటలు చూసే సినిమాలో అన్ని బాగుంటేనే చూస్తాం, మరి మన చుట్టూ ఉండే వాతావరణం బాగుండాలి కదా?
సినిమాలతో మనిషి మారతాడా? ఇలాంటి అక్షరాలతో మారతాడా?
కానీ, ప్రకృతి ఉంటేనే మనిషి కి మనుగడ ఉంటుంది. ఇదే సత్యం. వీలైతే, మీ ఇంట్లో, ఒక మూలాన, చేసిన ప్లాస్టరింగ్ పగలకొట్టి “ఒక్క మొక్క నాటండి”. ఇది నా టీవీ చేసే విజ్ఞప్తి.
నిరంతరం కింద పడే ఒక చిన్న నీటి బిందువు, ఎంతటి గట్టి రాతినైనా రంధ్రం చెయ్యగలడు. మార్పు ఒక రోజులో రాకపోవచ్చు. మీ వంతు ప్రయత్నం చెయ్యండి. మీ ప్రయత్నానికి నా అభినందనలు!
“నిన్నటి పచ్చదనం… నేటి కాంక్రీట్… రేపటి శ్మశానం”
-మీ తురగా పవన్ చంద్.



